: హైదరాబాద్ నుంచి పాలన కొనసాగించాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులున్నాయి!: చంద్రబాబు
హైదరాబాద్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం సృష్టించారని, ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వెలగపూడిలో కట్టుదిట్టంగా అసెంబ్లీ భవనాన్ని నిర్మించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... అతి తక్కువ కాలంలోనే అమరావతిలో శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యేలా చేశామని అన్నారు. మొదట గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాలను గురించి మరోసారి విన్నామని చెప్పారు. మొన్నటి వరకు రెండు ప్రాంతాల నుంచి పరిపాలన చేశామని, హైదరాబాద్ నుంచి అమరావతికి రావడానికి అధికారులు ఎన్నో సమస్యలు ఎదుర్కున్నారని ఆయన అన్నారు.
హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించాలంటే ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని చంద్రబాబు అన్నారు. ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎదుర్కుంటూ ముందుకు వెళదామని అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు సహకరించారని అన్నారు. భూమిని ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ప్రతినిధులకు వారు భోజనం కూడా పెట్టారని వ్యాఖ్యానించారు. విజభన వల్ల వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఓ విజన్‌తో పనిచేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ నుంచి పరిపాలనకు పదేళ్ల సమయం ఉన్నా ఏపీలోనే పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.