: ఉత్తర కొరియా మరో దుస్సాహసం... జపాన్ తీరంలోని సముద్రంపైకి నాలుగు క్షిపణుల ప్రయోగం!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ జపాన్ పైకి దుస్సాహసానికి దిగారు. ఈ తెల్లవారుజామున జపాన్ తీరంలోని సముద్రంపైకి నాలుగు ఖండాంతర క్షిపణులను ప్రయోగించారు. ఈ విషయాన్ని జపాన్ ప్రధాని షింజో అబే స్వయంగా వెల్లడించారు. ఉత్తరకొరియా సరిహద్దుల్లోని టాంగ్ చాంగ్ -రి అనే ప్రాంతం నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించే క్షిపణులను ప్రయోగించినట్టు ఆరోపించారు. ఇది తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే చర్యని, ఐరాస భద్రతామండలి నిర్ణయాలకు ఈ చర్యలు విరుద్ధమని ఆయన అన్నారు.
ఈ క్షిపణుల వల్ల ముప్పు వాటిల్లనప్పటికీ, ఇది ప్రమాదకర చర్యని అబే అన్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని అమెరికన్ అధికారుల సాయంతో విశ్లేషిస్తున్నట్టు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించింది. ఇదే సమయంలో పరిస్థితిని సమీక్షించేందుకు తాత్కాలిక అధ్యక్షుడు హ్వాంగ్ క్యో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. అమెరికా మాత్రం ఈ విషయమై ఇంకా స్పందించలేదు. ఇటీవలి దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలకు వ్యతిరేకంగానే ఉత్తరకొరియా ఈ పని చేసినట్టు భావిస్తున్నారు.