: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏడాది ఉద్యోగాల జాతర.. 30 శాతం అధికంగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటన
ప్రముఖ ఆన్‌లైన్ విక్రయ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది ఉద్యోగాల జాతరకు తెరతీయనుంది. మరో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుండడంతో ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా దానిని సమర్థంగా ఎదుర్కోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గతేడాదితో పోలిస్తే ఈసారి 30 శాతం అధికంగా ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ సీవీవో నితిన్ సేథీ తెలిపారు.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సంస్థను విస్తరించనున్నట్టు పేర్కొన్న ఆయన అందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 10వేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. గతేడాది 1500 మంది ఉద్యోగులను తీసుకుంది. ఇప్పుడు మళ్లీ మరికొందరిని తీసుకోవాలని నిర్ణయించింది. కాగా మరో ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ తమ ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇస్తుంటే ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించడం గమనార్హం.