: యూపీలో కొంగుబిగించిన ప్రముఖుల భార్యలు.. బరిలో 40 మంది.. విజయం కోసం ఆరాటం!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగిన 40 మంది మహిళలు ఇప్పుడు విజయం కోసం చెమటోడుస్తున్నారు. వివిధ కారణాలతో ఎన్నికలకు దూరమైన సీనియర్ నేతలు మరో మార్గం లేక తమ భార్యలను రంగంలోకి దింపారు. బరిలో ఉన్న వారిలో ఎక్కువమంది బీజేపీ టికెట్‌పైనే పోటీ చేస్తున్నారు. బీఎస్పీ హయాంలో విద్యాశాఖామంత్రిగా పనిచేసిన రాకేశ్ ధార్ త్రిపాఠీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన తన సతీమణి ప్రమీలా త్రిపాఠీని ఆప్నాదళ్ టికెట్‌పై బరిలోకి దింపారు. అలహాబాద్‌లోని మేజా స్థానంపై గట్టిపట్టున్న ఉదయ్‌భానుపై పలు క్రిమినల్ కేసులు ఉండడంతో పోటీకి దూరమైన ఆయన సతీమణి నీలిమను బీజేపీ టికెట్‌పై పోటీకి నిలిపారు.
మాయావతిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ తన భార్య స్వాతిసింగ్‌ను లక్నోలోని సరోజినీనగర్ నుంచి పోటీలోకి దింపారు. అలాగే మంత్రి యాసిర్ షా సతీమణి రూబా, బీజేపీ ఎమ్మెల్యే కుశాల్ కిషోర్ భార్య జై దేవి, మంత్రి రాజా మహేంద్ర సింగ్ భార్య పక్షాలికాసింగ్, 2005లో గ్యాంగ్‌స్టర్ల చేతిలో మరణించిన బీజేపీ నేత కృష్ణనందన రాయ్ భార్య అల్కారాయ్, 2013 మత ఘర్షణల్లో మరణించిన హిందూ యువ వాహిని నేత రాంబాబు గుప్తా భార్య సంజు దేవి, బీఎస్పీ మహిళా ఎమ్మెల్యే పూజాపాల్ తదితరులు ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెట్టారు. విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరి వారి కష్టం ఏమేరకు ఫలిస్తుందో తెలియాలంటే ఈనెల 11 వరకు ఆగాల్సిందే.