: ఓ వ్యక్తి చేసిన పనికి అమెరికాను అలా నిర్వచిస్తారా?: కాన్సస్ గవర్నర్
ఓ వ్యక్తి చేసిన విద్వేషపూరిత చర్య ఆధారంగా అమెరికాను అంచనా వేయడం సరికాదని కాన్సస్ గవర్నర్ శామ్ బ్రౌన్‌బ్యాక్ అన్నారు. స్థానిక ప్రవాస భారతీయులతో సమావేశమైన బ్రౌన్ వారితో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు అండగా ఉన్నామని, భారతీయుల సేవలు కాన్సస్‌ను మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టాయని అన్నారు. భారతీయులకు కాన్సస్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని పేర్కొన్న గవర్నర్, ఓ వ్యక్తి చేసిన విద్వేషపూరిత చర్య వల్ల మొత్తం అమెరికాను అదే తరహాలో నిర్వచించడం సరైనది కాదని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఓ ఘటన ఆధారంగా అమెరికాను అంచనా వేయడం సరికాదని పేర్కొన్నారు.
కాన్సస్‌లో తెలుగు వ్యక్తి కూచిభొట్ల శ్రీనివాస్(32), ఆయన స్నేహితుడు అలోక్‌రెడ్డి మాదసాని(32)పై ప్యూరింటన్ అనే మాజీ సైనికోద్యోగి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతి చెందగా అలోక్ గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన మరువకముందే సౌత్ కరోలినాలో హర్నీస్ పటేల్(43) అనే భారతీయుడిని ఆయన ఇంటి ముందే దుండగులు కాల్చి చంపారు. తాజాగా కెంట్‌లో దీప్‌రాయ్(39) అనే సిక్కు వ్యక్తిపైనా కాల్పులు జరిగాయి. తీవ్ర గాయాలపాలైన ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు.