: సౌదీ షేక్ దేవుడిలా నన్ను కాపాడారు!: స్వదేశం చేరుకున్న లింబాద్రి


సౌదీ అరేబియాలో జరిగిన ఓ హత్య కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవిస్తున్న లింబాద్రిని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, ఎంపీ కవిత చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సౌదీ నుంచి హైద్రాబాద్ కు లింబాద్రి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను మళ్లీ భారత్ కు తిరిగి వస్తానని అనుకోలేదని, సౌదీ షేక్ దేవుడిలా తనను కాపాడారని, ఆయన మేలు మర్చిపోలేనని అన్నారు.

కాగా, ఆర్మూర్ మండలం దేగాంకు చెందిన చేపూర్ లింబాద్రి జీవనోపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అయితే, 2007లో అక్కడ జరిగిన ఓ హత్య కేసులో అతను అరెస్టు అయ్యాడు. సౌదీ న్యాయస్థానం ఆయనకు మరణ శిక్ష విధించింది. లింబాద్రి కుటుంబ సభ్యుల వినతి మేరకు ఎంపీ కవిత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలిసి జరిగిన విషయాన్ని తెలిపారు.

దీంతో, విదేశాంగ శాఖ అధికారుల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. మరణ శిక్షకు బదులు జైలు శిక్ష, పది లక్షల రియాల్స్ (మన కరెన్సీలో సుమారు రూ.1.80 కోట్లు) జరిమానాగా విధిస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పు నిచ్చింది. అయితే, అంత మొత్తం చెల్లించే ఆర్థిక స్థోమత లింబాద్రి కుటుంబానికి లేదు. దీంతో, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ఓ సౌదీ షేక్ ముందుకు రావడంతో లింబాద్రి  జైలు నుంచి బయటపడ్డాడు.    

  • Loading...

More Telugu News