: ఆర్బీఐ గవర్నర్ కు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి అరెస్టు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను ఆ పదవి నుంచి దిగిపోవాలని బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి ఉర్జిత్ పటేల్ తప్పుకోవాలని, లేని పక్షంలో ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులకు హాని తలపెడతానంటూ మహారాష్ట్రకు చెందిన వైభవ్ అనే వ్యక్తి మెయిల్ పంపాడు. ఈ మెయిల్ ను ఆర్బీఐ సీనియర్ ఆఫీసర్ కు ఉర్జిత్ ఫార్వర్డ్ చేయడంతో, ఆ ఆఫీసర్ ముంబయి సైబర్ సెల్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నాగ్ పూర్ లోని ఓ సైబర్ కేఫ్ నుంచి సదరు ఈ-మెయిల్ వచ్చినట్టు తెలుసుకున్నారు. నాగ్ పూర్ కు వెళ్లిన సైబర్ పోలీసులు, రెండు రోజుల క్రితం నిందితుడిని అరెస్టు చేశారు. నాగపూర్ కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టగా ఈ నెల 6 వరకు అతన్ని పోలీసు కస్టడీలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, వైభవ్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాడని, ప్రస్తుతం ఉద్యోగం లేకుండా ఉన్న అతను నిరాశలో ఉన్నాడని, ఈ నేపథ్యంలోనే ఉర్జిత్ పటేల్ కు బెదిరింపు మెయిల్ పంపి ఉంటాడని భావిస్తున్నట్లు చెప్పారు.