: రోజాలో పశ్చాత్తాపం లేదు.. నేను మొండి దానిని కాబట్టే లేచి తిరుగుతున్నాను: టీడీపీ ఎమ్మెల్యే అనిత
2015 శీతాకాల సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే అనితలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికీ ఆమెను వెంటాడుతున్నాయి. ఏడాది పాటు సస్పెన్షన్ ను ఎదుర్కొన్న రోజాపై మరో ఏడాది కాలం సస్పెన్షన్ కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫారసు చేసింది. దీంతో, ఈ సారి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకూ రోజా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిత ఒక న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, ‘ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు గారికి, సభ్యులకూ మీడియా తరపున థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే, నా బాధ అర్థం చేసుకున్నందుకు ... నా ఆవేదనను గుర్తించి ప్రివిలేజ్ కమిటీ ద్వారా రోజా సస్పెన్షన్ కు సిఫారసు చేసినందుకు నా కృతఙ్ఞతలు చెబుతున్నాను. ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా హాజరైనప్పుడు.. ‘అనితకు క్షమాపణ చెబుతారా?’ అని వాళ్ల పార్టీకి చెందిన ప్రివిలేజ్ కమిటీ సభ్యుడే రోజాను అడిగినప్పుడు, ఆమె సమాధానం చెప్పకుండా దాట వేసింది. ఈ విషయం కూడా ప్రివిలేజ్ కమిటీలో ఉంది. అవసరమైతే, చదువుకోవచ్చు.
ఇన్ని జరిగిన తర్వాత కూడా రోజాలో మార్పు లేదు. నాకు క్షమాపణ చెబుతానంటూ రోజా రాసిన లెటర్ కూడా ప్రజలందరూ చదివారు. ‘అనిత బాధపడి ఉంటే..’ అని ఆ లెటర్ లో రోజా రాశారు. రోజా చేసిన వ్యాఖ్యలకు మనిషి అనే వారు ఎవరైనా బాధపడతారు. నేను మొండిదాన్ని కాబట్టి, లేచి తిరుగుతున్నాను. రోజా చేసిన వ్యాఖ్యలకు మానసిక స్థైర్యం లేని మహిళలు అయితే, ఉరి వేసుకుని చచ్చిపోతారు. నేను మొండి దానిని కాబట్టి.. ఎలాగైనా న్యాయం జరగాలని, నా లాంటి వాళ్లు ఎవరూ బాధపడ కూడదని నిలబడ్డాను కాబట్టి, ఈ రోజు నాకు న్యాయం జరిగింది.
‘అనిత బాధ పడితే క్షమాపణ’ చెబుతానని చెప్పిన రోజా వ్యాఖ్యలకు నేను సంతృప్తి చెందలేదు. అదే సమయంలో, ప్రివిలేజ్ కమిటీ కూడా సంతృప్తి చెందలేదు. ఒక తప్పుకు రోజా శిక్ష అనుభవించారు. పశ్చాత్తాపమనేది ఎవరికైనా ఉంటుంది. కానీ, రోజా లో ఆ పశ్చాత్తాపం కనపడటం లేదు. స్పీకర్ గారి మీద, సీఎం చంద్రబాబు, లోకేశ్ బాబు మీద నోటికి ఎంత వస్తే అంత రోజా మాట్లాడుతున్నారు తప్పా, ఆమె తీరులో కానీ, హావభావాల్లో కానీ ఏ మార్పు కనిపించడం లేదు. అందుకే, రోజా సప్పెన్షన్ మరో ఏడాది పాటు తిరిగి కొనసాగించాలని, దీనికి స్పీకర్ గారు కూడా అంగీకరించాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.