: వచ్చేస్తోంది నిరుద్యోగ భృతి... పట్టభద్రుల కోటాలో తమ అభ్యర్థులను గెలిపించాలన్న టీడీపీ
ఈ సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో నిరుద్యోగ భృతి కింద నిధులను కేటాయిస్తామని తెలుగుదేశం నేతలు ప్రకటించారు. ఈ ఉదయం కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, పట్టభద్రులంతా తమ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ టీజీ వెంకటేష్ తో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, ఎన్నికల మ్యానిఫెస్టోలో తమ నేత చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు ప్రతి నెల భృతిని కల్పించేందుకు కట్టుబడి వున్నామని, రాష్ట్రంలో నిరుద్యోగుల లెక్కలు బయటకు తీస్తున్నామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకుని, ఆపై ఎమ్మెల్యే కోటాలో బీసీలకు సీట్లను అడుగుతామని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, వారి వైఖరిని ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు.