: మరో వికెట్ ను తీసిన భారత్... జిడ్డుగా సాగుతున్న ఆస్ట్రేలియా బ్యాటింగ్
పరుగులు చేయడం కన్నా, వికెట్లను కాపాడుకోవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ జిడ్డుగా సాగుతున్న వేళ, బెంగళూరులో జరుగుతున్న టెస్టులో లంచ్ విరామ సమయానికి భారత్ రెండు వికెట్లను మాత్రమే తీయగలిగింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో భాగంగా నిన్న 16 ఓవర్లలో 40 పరుగులు సాధించిన జట్టు, నేటి ఆటలో మరో 29 ఓవర్లను ఎదుర్కొని 47 పరుగులు మాత్రమే సాధించింది.
ఈ క్రమంలో ఓపెనర్ వార్నర్, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ స్మిత్ వికెట్లను కోల్పోయింది. 52 బంతులాడిన స్మిత్ 8 పరుగులకు జడేజా బౌలింగ్ లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రెన్షా 144 బంతులను ఎదుర్కొని 44 పరుగులు చేసి క్రీజులో నిలదొక్కుకుని ఉండగా, అతనికి మార్ష్ వచ్చి జతగా చేరాడు. రెండో రోజు లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 45 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు.