: దక్షిణ కాశ్మీర్ లో ఉదయం నుంచి భారీ ఎన్ కౌంటర్... జవాను మృతి, ఇద్దరు ఉగ్రవాదుల హతం
దక్షిణ కాశ్మీర్ లోని త్రాల్ ప్రాంతంలో ఓ రెసిడెన్షియల్ భవంతిలో దాగున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తుండగా, ఈ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ ముష్కరుల కాల్పుల్లో ఓ జవాను మృతి చెందగా, సైనిక దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారాన్ని అందుకున్న భద్రతా దళాలు, అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు తమ వద్ద ఉన్న ఆయుధాలతో విరుచుకుపడ్డారు. వారి కాల్పుల్లో మంజూర్ అహ్మద్ అనే పోలీసు మరణించాడు. ఇద్దరు ముజాహిద్దీన్ తీవ్రవాదులను మట్టుబెట్టామని అధికారులు తెలిపారు. భారీగా మందుగుండుతో వచ్చి తిష్ట వేసి, జవాన్లపై కాల్పులు ప్రారంభించిన ఉగ్రవాదులను అత్యంత సాహసంతో అహ్మద్ ఎదిరించారని, ఆయన మృతి తమకు తీరనిలోటని అన్నారు.