: అమెరికాలో ఇంకో ఘోరం... 'మీ దేశానికి వెళ్లిపో' అంటూ సిక్కు యువకుడిపై ఇంటి ముందే కాల్పులు
జాత్యహంకారం నానాటికీ పెరిగిపోతున్న అమెరికాలో మరో ఘోరం జరిగింది. వాషింగ్టన్ పరిధిలోని కెంట్ సిటీలో ఓ శ్వేతజాతి దుండగుడు, సిక్కు వ్యక్తి (39)పై అతని ఇంటి ముందే కాల్పులు జరిపాడు. తన విధులను ముగించుకుని ఇంటికి వచ్చిన బాధితుడితో గుర్తు తెలియని వ్యక్తి, వాదనకు దిగి, 'మీ దేశానికి వెళ్లిపో' అని కేకలు పెడుతూ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో సిక్కు యువకుడి చేతిలోకి బులెట్ దిగగా, ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని కెంట్ పోలీస్ చీఫ్ కెన్ థామస్ వెల్లడించారు. బాధితుడి ప్రాణాలకు అపాయం లేదని వెల్లడించిన ఆయన, దుండగుడు ఆరడుగుల పొడవు వున్నాడని, ముఖానికి మాస్క్ ధరించి వచ్చాడని, అతన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని రెంటన్ సిక్కు సమాజం నేత జస్మిత్ సింగ్ వెల్లడించారు.