: సైలెంటుగా 'అక్బర్ ఖిల్లా' పేరు మార్చేసిన బీజేపీ మంత్రి!
మొఘల్ చక్రవర్తి అక్బర్ హయాంలో నిర్మించిన పురాతన కోట 'అక్బర్ కా ఖిల్లా' పేరును బీజేపీ మంత్రి ఆదేశాల మేరకు చడీ చప్పుడు లేకుండా మార్చేసిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. అజ్మీర్ లోని అక్బరు కోట పేరుకు 'అజ్మీర్ కా ఖిల్లా అండ్ సంగ్రహాలయ్'గా మార్చారు. 1570 ప్రాంతంలో అక్బర్ దీన్ని నిర్మించిన తరువాత రాథోడ్, మరాఠా వంశస్థులతో పాటు బ్రిటీష్ వారు ఈ కోట కేంద్రంగా పాలన సాగించారు.
బీజేపీ మంత్రి, ఆర్ఎస్ఎస్ నేత వాసుదేవ్ దేవ్నానీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ విధమైన కమిటీ స్క్రూటినీ చేయకుండానే కోట పేరును మార్చారని తెలుస్తోంది. అజ్మీర్ నార్త్ శాసనసభ్యుడైన వాసుదేవ్ ఆదేశాల మేరకు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హర్ ఫూల్ యాదవ్ కోట పేరును మారుస్తూ, ఆదేశాలు జారీ చేయగా, ఆ వెంటనే కోట ప్రవేశద్వారం వద్ద పేరును అధికారులు మార్చి రాశారు. ఈ విషయంలో రాజస్థాన్ పురావస్తు శాఖ అధికారులను సంప్రదించినా, వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. కాగా, ఈ ప్రాంతంలోని పౌరుల సెంటిమెంట్ ను గౌరవిస్తూ పేరు మార్చామని, అక్బర్ కన్నా ముందే ఆజ్మీర్ నగరానికి చరిత్ర ఉందని, 9వ శతాబ్దం నుంచే ఈ నగరం ఉందని వాసుదేవ్ వ్యాఖ్యానించారు.