: అవగాహనా రాహిత్యం వల్లే ఆ అమ్మాయి అలాంటి కామెంట్ చేసింది!: ఢిల్లీ యూనివర్శిటీ యువతి పోస్టుపై స్పందించిన వెంకయ్యనాయుడు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతున్నారన్న సంగతి విశాఖపట్టణంలో జరిగిన బహిరంగ సభలో వెల్లడైంది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ కు ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన యువతి అవగాహనా రాహిత్యంతో సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసిందని అన్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోందని ఆయన చెప్పారు. అందులో ఆ యువతి తన తండ్రి ఇండియన్ ఆర్మీలో పని చేస్తూ మృతి చెందారని... అయితే తన తండ్రిని చంపింది పాకిస్థాన్ కాదని, యుద్ధమని తెలిపిందని ఆయన పేర్కొన్నారు.
'మరి, ఆ యుద్ధం ఎవరితో చేస్తూ ఆయన మృతి చెందారు? పాకిస్థాన్ తోనే కదా?' అని ఆయన చెప్పారు. ఇలాంటి అవగాహనలేని వారి వాదనలు ఎవరూ వినవద్దని ఆయన సూచించారు. చట్టసభల స్థాయి పడిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులను సభకు పంపకపోవడం వల్లనే, 'బయటకు వస్తే నీ సంగతి చూస్తా'ననే రాజకీయ నాయకులు పెరిగిపోయారని ఆయన ఎధ్దేవా చేశారు. అలాంటి వారిని ఏం చేయాలో అదే చేస్తారని ఆయన తెలిపారు.