: పది మందిలో వున్నప్పుడు క్వీన్ ఎలిజబెత్ సిబ్బందికి ఆదేశాలు ఎలా ఇస్తారో తెలుసా?
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ప్రజల్లోకి వచ్చినప్పుడు కానీ, ఇతరత్రా సమావేశాల్లో వున్నప్పుడు కానీ, తానేం చేయాలనుకుంటున్నారో, తనకు ఏం కావాలో సిబ్బందిని పిలిచి ఆదేశాలు ఇవ్వడం చాలా కష్టం. ఆమె అవసరాలు గుర్తించి మసలుకునే సిబ్బంది ఎంతో మంది ఆమె చుట్టూ ఉంటారు. వారంతా ఆమెను కనిపెట్టుకుని ఉంటారు. అలాంటి వారికి ఆమె పబ్లిక్ లో ఎలా సందేశాలు పంపుతారు? అన్న విషయాలను చరిత్రకారుడు హ్యూగో వికర్స్ 'పీపుల్స్ మ్యాగజైన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అలా పబ్లిక్ లేదా మీటింగ్ లలో ఆమె సంకేత భాషను ఆశ్రయిస్తారు.
ఈ మేరకు సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. అలాంటి సంకేత భాషలో ఆమె వెడ్డింగ్ రింగ్, హ్యాండ్ బ్యాగ్ కీలక పాత్ర పోషిస్తాయి. వెడ్డింగ్ రింగ్ ను ఆమె పక్కకు తిప్పారంటే... అక్కడ జరుగుతున్న సంభాషణ విషయాన్ని మళ్లించాలి. 'మీరు వచ్చి జోక్యం చేసుకోండి' అని అర్థమని ఆయన తెలిపారు. అలా ఆమె రింగ్ ను పక్కకు తిప్పగానే, ఆమె సిబ్బంది ఎవరో ఒకరు వచ్చి మర్యాదగా ఏదో ఒక విషయం చెప్తారు. అలా సంభాషణ టాపిక్ మారిపోతుంది. అంతే కాకుండా, తన హ్యాండ్ బ్యాగును ఒక చేతి నుంచి మరో చేతికి మార్చితే ప్రసంగం ముగించాలనుకుంటున్నారని అర్థం. అలా కాకుండా అదే హ్యాండ్ బ్యాగు బల్ల మీద పెడితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిగ్నల్ ఇస్తున్నారని అర్థం.
అలా బహిరంగ ప్రదేశాలు, మీటింగ్ లు కాకుండా క్వీన్ ఎలిజబెత్-2 అధికారిక నివాసమైన బకింగ్ హామ్ ప్యాలస్ లో సమావేశాలు ఉంటే మాత్రం తన సిబ్బందిని పిలిచేందుకు రాణి ఓ ప్రత్యేకమైన బజర్ వాడతారు. అది నొక్కితే అతిథులని లోపలికి ఆహ్వానించడానికి ప్యాలస్ తలుపులు తెరవాలని సంకేతం అని ఆయన వెల్లడించారు. ఈ సైగల భాషను క్వీన్ ఎలిజబెత్ మాత్రమే కాకుండా ఆమె మనవరాలు కేట్ మిడిల్టన్ కూడా పాటిస్తుంటారని ఆయన చెప్పారు. కేట్ బయటికి వెళ్లినప్పుడు క్లచ్ బ్యాగ్ మాత్రమే తీసుకెళ్తారు. కేట్‌కి ఒక చేత్తో బ్యాగ్ పట్టుకుని నడవడం అస్సలు నచ్చదు. అలా నడుస్తున్నప్పుడు చేతులు వూపాల్సి వస్తుందని రెండు చేతులతో బ్యాగును ముందు పెట్టుకుని నడుస్తుంటారని ఆయన తెలిపారు.