: పవన్ ఇచ్చిన ఆ సలహాతోనే దర్శకుడిని అయ్యా.. నంది అవార్డు గెలుచుకున్నా: దయా కొడవటిగంటి
‘అలియాస్ జానకి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన దయా కొడవటిగంటి ఇటీవల ప్రకటించిన 2013 ఏపీ నంది అవార్డుల్లో ఉత్తమ దర్శకుడి పురస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గురించి పలు అంశాలు తెలిపారు. వాస్తవానికి తాను సినీ రంగంలో నటుడిగా ఉండాలని అనుకున్నానని చెప్పారు. అయితే, సినీనటుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన సలహాతో డైరెక్షర్ గా మారిపోయానని అన్నారు. గతంలో ఆయన పవన్ నటించిన ‘ఖుషి’ సినిమాకు అప్రెంటీస్‌గా ఉన్నారు. అనంతరం పవన్ నటించిన ‘జానీ’ సినిమా నుంచి ‘పంజా’ వరకు అన్ని సినిమాల్లోనూ కనిపించారు.
ఆ సమయంలోనే మంచి నటుడిని కావాలని ఉందని పవన్ కల్యాణ్‌తో తాను చెప్పానని, అయితే, ముందుగా సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల మీద అవగాహన పెంచుకోమని పవన్ సలహా ఇచ్చారని దయా కొడవటిగంటి చెప్పారు. సినిమాల్లో తనకు వేషాలు ఇప్పించిన పవన్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు పవన్ దగ్గర దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రయత్నాలు మొదలుపెట్టిన తనకు ‘అలియాస్ జానకి’ సినిమా అవకాశం దొరికిందని పేర్కొన్నారు. తనకు వచ్చిన నంది అవార్డును పవన్ కల్యాణ్‌కు అంకితమిస్తున్నానని ఆయన సంతోషంగా చెప్పారు.