: బాహుబలి-2 ఎఫెక్ట్.. కర్ణాటకలోని థియేటర్లను తగలబెట్టే అవకాశం రావచ్చన్న కన్నడ నటుడు
కన్నడ సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి డబ్బింగ్ సినిమాలను ఎప్పుడో నిషేధించింది అక్కడి పరిశ్రమ. ఇప్పుడు మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇతర భాషల చిత్రాలను కన్నడలోకి డబ్బింగ్ చేస్తే... సినీ ప్రేక్షకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని, థియేటర్లను కూడా తగలబెట్టే పరిస్థితి తలెత్తవచ్చని ప్రముఖ కన్నడ నటుడు జగ్గేష్ ట్వీట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. 'బాహుబలి-2' సినిమాను కన్నడలోకి డబ్బింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కథనాల నేపథ్యంలోనే ఈ వివాదం రాజుకుంది.
కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ మాట్లాడుతూ, కన్నడ సినీరంగంలో డబ్బింగ్ సినిమాల భూతానికి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పాడు. బెంగళూరులోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీన కన్నడ సంఘాలు, సినిమా వర్గాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను కూడా ఆహ్వానించామని చెప్పారు. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమ కష్టాల్లో ఉందని... డబ్బింగ్ సినిమాలకు అనుమతి ఇస్తే కన్నడ నటులు, కళాకారులు ఎక్కడకు వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వినతిని పెడచెవిన పెట్టి డబ్బింగ్ సినిమాలను ప్రదర్శిస్తే, తానే స్వయంగా ఆ థియేటర్లకు నిప్పు పెడతానని హెచ్చరించారు.