: అదృశ్యమైన మంత్రి.. యూపీ సీఎంకు కొత్త తలనొప్పి.. విమానాశ్రయాల్లో అలెర్ట్


ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు కొత్త తలనొప్పి వచ్చింది. బాలికపై అత్యాచారయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయత్రీ ప్రజాపతి కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్న ఆయన విదేశాలకు పారిపోయే అవకాశాలున్నాయన్న సమాచారంతో విమానాశ్రయాల్లో అలెర్ట్ ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజాపతి అమేథీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. వారం రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు విమానాశ్రయాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు ముందస్తు బెయిలు కోసం సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.  

మరోవైపు ప్రజాపతి వ్యవహారం ముఖ్యమంత్రి అఖిలేష్ మెడకు చుట్టుకుంది. ఈ విషయంలో ప్రధాని మోదీ అఖిలేష్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ప్రజాస్వామ్యంలో కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సి వస్తుందని, తాను కూడా అలాగే చేశానని సీఎం పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలతో గతేడాదే అఖిలేష్ తన మంత్రివర్గం నుంచి ప్రజాపతిని తప్పించడం గమనార్హం. అయితే  తండ్రి ములాయం సింగ్ యాదవ్, శివపాల్ బలవంతంతో తిరిగి ఆయనను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News