: పేదలకు 'ఆస్కార్ భోజనం' రుచి చూపించిన హాలీవుడ్ నటి!
ఆస్కార్ వేడుక అనగానే ఎర్రతివాచీ స్వాగతం, లేటెస్ట్ వేషధారణ, కళ్లు మిరుమిట్లు గొలిపే లైటింగ్, అందాల భామల హొయలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల ఆలింగనాలు... ఇలా ఎన్నో విశేషాలు కనువిందు చేస్తాయి. అవార్డుల ప్రదానోత్సవంలో పురస్కారాలు గెల్చుకున్న వారిని అందరూ అభినందిస్తారు, ప్రశంసిస్తారు. అయితే, ఇదే కార్యక్రమంలో ఎలాంటి పురస్కారం పొందని భారతీయ, అంతర్జాతీయ నటి ఫ్రీదా పింటో (స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్) ఓ మంచి పని చేసి అంతర్జాతీయ సినీ ప్రముఖుల ప్రశంసలు పొందింది.
సాధారణంగా ఆస్కార్ వేడుకలు నిర్వహించే సమయంలో ఆహూతులకు భారీ విందు ఏర్పాటు చేస్తారు. ఈ విందులో చాలా ఆహార పదార్థాలు మిగిలిపోయాయి. మామూలుగా అయితే, ఇలాంటి వేస్టేజీని పారబోస్తారు. ఇక్కడే ఫ్రీదా పింటో మంచి ఐడియాతో పని చేసింది. ఈ విందు ఏర్పాట్లు చేసిన కోపియా హోటల్ తో కలిసి అలా మిగిలిపోయిన ఆహారపదార్థాలను సేకరించి, వాటిని ప్యాక్ చేయించి, లాస్ ఎంజెలెస్ లోని నిరాశ్రయులు, నిరుపేదలకు పంచిపెట్టింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రాంలో ఓ పోస్టు చేసింది. ఆస్కార్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపింది. అంతకంటే కొపియా హోటల్ తో కలిసి చేసిన మంచిపని మరింత ఆనందాన్నిచ్చిందని పేర్కొంది. దీంతో ఆమెను అంతా అభినందిస్తున్నారు.