: అలియా భట్ ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్టు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్, అతని భార్య సోనీ రజ్దాన్, వారి కుమార్తె బాలీవుడ్ నటి అలియా భట్ లను చంపేస్తానని ఫోన్ లో బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లక్నోకు చెందిన నిరుద్యోగి సందీప్ సాహూ అండర్ వరల్డ్ డాన్ బాబ్లూ శ్రీవాస్తవ పేరుతో మహేష్ భట్ కు ఫోన్ చేసి తక్షణం 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే కుటుంబం మొత్తాన్ని లేపేస్తానని బెదిరింపులకు దిగారు. దీంతో వేగంగా స్పందించిన మహేశ్ భట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు ఫోన్ కాల్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. అక్కడి పోలీసులకు కేసు బదలాయించడంతో వేగంగా స్పందించిన యూపీ పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ సహాయంతో 12 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు.
విచారణలో సందీప్ సాహూ పలు విషయాలు వెల్లడించాడు. బాలీవుడ్ లో పాగావేయాలని లక్నో నుంచి బయల్దేరి ముంబై చేరాడు. అయితే అతని ఆశలు అడియాసలయ్యాయి. ఊహించినట్టు అతనికి అవకాశాలు రాలేదు. దీంతో అంతకు ముందు వ్యాపారం పేరిట బంధువుల నుంచి తీసుకున్న 6 లక్షల రూపాయల అప్పుకు వడ్డీలు పెరిగిపోయాయి. వాటిని తీర్చడమెలాగో అర్థం కాలేదు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని భావించిన సందీప్ సులువుగా డబ్బు సంపాదించేందుకు నేరాలు చేయడమే సరైన మార్గం అని భావించాడు. దీంతో డబ్బు కోసం ఏకంగా మహేష్ భట్ కు ఫోన్ చేసి బెదిరించాడు. అయితే అతని ఊహలు తల్లికిందులయ్యాయి. దీంతో కటకటాల వెనక్కి వెళ్లాడు.