: క్వీన్ ఎలిజబెత్ చనిపోయేంత వరకు వేచి చూస్తా...రాజ్యాన్ని అప్పగించండి: స్వయం ప్రకటిత రాజు లీగల్ నోటీస్


అమెరికాలోని కొలరాడోకి చెందిన అలెన్‌ వి. ఎవన్స్‌ అనే వ్యక్తి ఇంగ్లండ్ ప్రజలకు ఒక లీగల్ నోటీసు జారీ చేశాడు. ఇందులో తాను స్వయం ప్రకటిత రాజునని ప్రకటించి...తన కుటుంబం ఎప్పుడో పాలించి వదిలేసిన సింహాసనాన్ని తనకు తిరిగి అప్పగించాలని బ్రిటన్ రాజకుటుంబానికి సూచిస్తూ, అందుకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని బ్రిటన్ ప్రజలకు 30 రోజుల గడువు కూడా ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళ్తే...3వ శతాబ్దంలో కింగ్‌ డమ్‌ ఆఫ్‌ వేల్స్‌ ను స్థాపించిన కునెడ్డా లెడిగ్‌ రాజుల వంశానికి చెందిన వ్యక్తినని, తన వంశం ఆపేసిన రాజ్యాపాలనను తాను పునరుద్ధరించాలని భావిస్తున్నానని అలెన్ వి.ఎవన్స్ అనే వ్యక్తి యూఎస్ లో ఓ పేపర్ ప్రకటన ఇచ్చాడు.

ఎప్పుడో ఆగిపోయిన తన వంశస్థుల పరిపాలనను కొనసాగించాలని, అందుకే ఇప్పుడు ఇంగ్లండ్‌ ను తానే పరిపాలించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ఈ మేరకు బ్రిటన్‌ ను స్వాధీనం చేసుకునేందుకు తన కుటుంబానికి ప్రజలు సహకరించాలంటూ లీగల్‌ నోటీసులు ఇచ్చాడు. దీనిపై 30 రోజుల్లో వారి అభిప్రాయాలను తెలపాలని కోరాడు. అంతేకాకుండా... ప్రస్తుతం బ్రిటన్‌ ను పరిపాలిస్తున్న క్వీన్ ఎలిజిబెత్‌-2 ఉన్నపళంగా తనకు రాజ్యాన్ని అప్పగించాల్సిన అవసరం లేదంటూ ఉదారత చూపిన ఆయన, క్వీన్ ఎలిజిబెత్‌-2 మరణానంతరం మాత్రం తాను రాజుగా ఇంగ్లండ్ ను పరిపాలిస్తానని, అంతవరకు వేచి చూస్తానని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. ఆయన ఈ ప్రకటనను సీరియస్ గానే ఇచ్చినప్పటికీ, అక్కడి ప్రజలు మాత్రం ఈ విషయాన్ని సరదాగా తీసుకుంటున్నారు.  

  • Loading...

More Telugu News