: అటువంటి కథలే కావాలని కూర్చుంటే సినిమాలు చేయలేం: హీరో రాజ్ తరుణ్
ఉయ్యాల జంపాలా సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న హీరో రాజ్ తరుణ్ ఆ తరువాత తీసిన సినిమాలు ‘చూపిస్తా మావా, కుమారి 21ఎఫ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ కూడా మంచి విజయం సాధించడంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఈ రోజు ఆయన ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలిపాడు. తాను సినిమా దర్శకుడు అవుదామని ఈ రంగంలో అడుగుపెట్టానని చెప్పాడు. మరో హీరో నాని కూడా అలాగే సినీరంగ ప్రవేశం చేశాడని చెప్పాడు.
ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ, ఎప్పుడో ఒకప్పుడు డైరెక్టర్‌గా కూడా అవతారం ఎత్తుతానేమో! అని రాజ్ తరుణ్ అన్నాడు. తన ముందుకు ఎంటర్ టైన్ మెంట్ సినిమాలే వస్తున్నాయని, కుటుంబ కథ, రొమాన్స్ తో కూడిన కథలు తన ముందుకు వచ్చినా సంతోషమేనని అన్నాడు. కానీ అదే కావాలి అని మొండిగా కూర్చుంటే సినిమాలు చేయలేమని చెప్పాడు. ఇక తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. తాను 2019లో వివాహం చేసుకుంటానని అన్నాడు.