: పోలీసులు వస్తున్నారన్న భయంతో పారిపోతూ.. కాలుజారి పడి మృతి
పోలీసులకు భయపడుతూ పారిపోతున్న క్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది. పూల వ్యాపారం చేసే శ్రీనివాస్ అనే వ్యక్తి నిన్న తన స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ అతడు ఉన్న రెండో అంతస్తులో అరుపులు రావడం విన్నారు. దీంతో పోలీసులు రెండో అంతస్తుపైకి ఎక్కారు. వారిని గమనించిన శ్రీనివాస్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ భవనం వెనుక పైపుల నుంచి కిందకు దూకుతుండగా జారిపడి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.
మరోవైపు నాలుగు రోజుల క్రితం కూడా విశాఖపట్నంలో జరిగిన ఇటువంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తప్పు చేసి పోలీసులకు పట్టుబడిన ఓ యువకుడు అనంతరం భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పెందుర్తిలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడనుంచి బైక్‌పై వెళుతున్న కృష్ణరాయపురానికి చెందిన అప్పలరాజును పోలీసులు టెస్ట్ చేయగా మద్యం సేవించినట్టు తేలింది. అతడిపై కేసు నమోదు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకోగా అనంతరం అప్పలరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు.