: వాట్సప్‌లో మూడుసార్లు తలాక్ చెప్పిన భర్త.. సుప్రీంను ఆశ్రయించిన ముస్లిం మహిళ!
మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేసి, మరొకరిని పెళ్లాడే (బహుభార్యత్వం) విధానానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న సంగతి విదితమే. అయితే, అదే తలాక్‌పై మరో ముస్లిం మహిళ నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీలో నివాసం ఉండే ముస్లిం ధనిక కుటుంబానికి చెందిన ఓ మహిళకు భారీగా కట్నం ఇచ్చి ఓ వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. వారికి ఓ పాప కూడా ఉంది. అయితే, తాజాగా భర్త ఫోన్ నుంచి వచ్చిన వాట్సప్ సందేశాన్ని చూసి షాక్ అయింది.
సదరు ముస్లిం మహిళ (28)కు ఆమె భర్త వాట్సప్‌లో తలాక్.. తలాక్.. తలాక్ అని పంపించాడు. తనకు ఇష్టం లేకపోయినా తన భర్త వాట్సప్ ద్వారా ఈ సందేశాన్ని పంపించడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు జరుగుతోన్న అన్యాయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనను తన భర్త, అత్తామామలు అదనపు కట్నం తేవాలని తరచూ వేధింపులకు గురిచేసేవారని ఆమె చెప్పింది. కొన్ని నెలల క్రితం తన భర్త తనను మెడపట్టుకుని బయటకు గెంటివేశాడని తెలిపింది. తమ సంప్రదాయం వల్ల తన కూతురు కూడా ఇబ్బందులు పడుతోందని చెప్పింది.