: శశికళ ఓ చెల్లని కాసు.. ఆమె నియామకం కూడా చెల్లదు: అన్నాడీఎంకే మాజీ న్యాయ సలహాదారు
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక కావడం చెల్లదని ఆ పార్టీ మాజీ న్యాయ సలహాదారు, సీనియర్ లాయర్ జ్యోతి చెప్పారు. శశికళ ఓ చెల్లని కాసులాంటివారని జ్యోతి చెప్పారు. క్రమశిక్షణ చర్యల కింది గతంలో శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని... దీంతో, పార్టీ సభ్యురాలిగా ఆమె గడిపిన రోజులు రద్దయినట్టేనని చెప్పారు.
పార్టీలో ఆమె మళ్లీ చేరిన తర్వాత నుంచి ఐదేళ్ల పాటు సభ్యురాలిగా కొనసాగితేనే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయడానికి ఆమె అర్హురాలు అవుతారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శిగా ఆమె నియామకం చెల్లదని, ఆమె తీసుకున్న నిర్ణయాలు చెల్లవని చెప్పారు. శశికళను దగ్గర ఉంచుకోవద్దని జయలలితకు తాను సూచించానని... అయినా ఆమె పట్టించుకోలేదని... ఫలితంగా తనను తాను కాపాడుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో అన్నాడీఎంకేను వదిలిపెట్టిన జ్యోతి డీఎంకేలో చేరారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్నారు.