: రాత్రి 2:30 గంటలకు ఒంటరిగా క్యాబ్ ఎక్కడమేంటని అడిగితే, తనకు అలవాటేనని చెప్పిన టెక్కీ: సీపీ భగవత్
రాత్రి 2:30 గంటల సమయంలో ఒంటరిగా బస్టాండులో వేచి చూస్తూ, అపరిచిత వ్యక్తులతో ప్రయాణాలు కూడదని వేధింపులకు గురైన మహిళా టెక్కీకి నచ్చజెప్పినట్టు రాచకొండ సీపీ భగవత్ మీడియాకు తెలిపారు. తాను స్వయంగా ఆమెతో మాట్లాడానని, ఇలా రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించడం ఏంటని ప్రశ్నిస్తే, తనకు అలవాటేనని ఆమె సమాధానం ఇచ్చిందని వివరించారు. ఈ తరహాలో క్యాబ్ లను ఎక్కి సమస్యలు కొనితెచ్చుకోవడం తగదని బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చామని వివరించారు. ఈ సందర్భంగా మహిళలకు ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. రాత్రుళ్లు నగరం పరిధిలో ప్రయాణించేందుకు అనువుగానే ఉందని, బయటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాత్రం తోడు తప్పనిసరని తెలిపారు.
ఆరు గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చిన వేళ, మహిళా ప్రయాణికులు, కుటుంబాలు ప్రయాణిస్తున్న బస్సులే క్షేమమని తెలిపారు. దయచేసి దూరప్రాంతాలకు ఒక్కరే వెళ్లవద్దని ఆయన కోరారు. ప్రయాణించాలంటే మాస్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ నే ఆశ్రయించాలని సూచించారు. ఆర్టీసీ లేదా ప్రైవేటు బస్సులైనా ఎక్కవచ్చని, రైళ్లు కూడా క్షేమమేనని, క్యాబ్ లో వెళ్లాల్సి వస్తే, కారుకు ముందు, వెనుక భాగంలో పోలీస్ రిజిస్ట్రేషన్ స్టిక్కర్ ను తప్పనిసరిగా పరిశీలించాలని కోరారు. దాని ఫోటో తీసుకుని, దాన్ని మిత్రులు, తల్లిదండ్రులకు పంపించి, తాను వస్తున్న కారు వివరాలు చెప్పి మరీ ఎక్కాలని అన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే, పోలీసులను ఆశ్రయించేందుకు సంకోచించ వద్దని అన్నారు. ఒకవేళ ఎయిర్ పోర్టుల్లో రాత్రుళ్లు ఒంటరిగా దిగితే, వారికోసం షీ క్యాబ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.