: 'లీ ఎకో'లో పెను సంక్షోభం... ఇద్దరు చీఫ్ లు సహా 85 శాతం భారత ఉద్యోగుల తొలగింపు


వినూత్నమైన ఫీచర్లతో, అందుబాటు ధరల్లో స్మార్ట్ ఫోన్లు విడుదల చేసి, అనతికాలంలోనే మిలియన్ల కొద్దీ అమ్మకాలు సాధించిన చైనా సంస్థ లీ ఎకోలో ఏర్పడ్డ నగదు కొరత సంక్షోభం మరింత తీవ్రమైంది. ఇండియాలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 85 శాతం మందిని నిర్దాక్షిణ్యంగా సంస్థ తొలగించింది. సంస్థను వీడి వెళ్లాలని ఇద్దరు ఉన్నతాధికారులను ఆదేశించింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్న అతుల్ జైన్, ఇంటర్నెట్ అప్లికేషన్స్ విభాగం చీఫ్ గా ఉన్న దేబాశిష్ ఘోష్ లు సంస్థ యాజమాన్యం కోరిక మేరకు రాజీనామా చేసినట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

ఒక దశలో చైనా దిగ్గజ సంస్థలు జియోమీ, ఒప్పో, వివోలతో పోటీ పడి నెలకు రూ. 80 కోట్లకుపైగా వ్యాపార ప్రకటనలకు ఖర్చు చేయడమే సంస్థ పతనానికి కారణమైందని తెలుస్తోంది. గత సంవత్సరం నవంబరులోనే నగదు కొరత ప్రభావాన్ని గుర్తించిన సంస్థ చీఫ్ జియో యూటింగ్, ఉద్యోగులకు లేఖ రాస్తూ, తాము ఇకపై స్మార్ట్ ఫోన్ వ్యాపారం నుంచి తప్పుకుని డ్రైవర్ లెస్ కార్లపై దృష్టిని సారించనున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, తాజాగా సంస్థ ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో పని చేస్తున్న వారిలో అత్యధికులను తొలగించిందని, బెంగళూరులోని డెవలప్ మెంట్ సెంటర్ ను మూసివేయనున్నదని తెలుస్తోంది. ఈ విషయమై లీ ఎకో ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలెక్స్ లీని వివరణ నిమిత్తం సంప్రదించగా, ఇద్దరు సీనియర్ ఉద్యోగులు వెళ్లిపోయారని ఖరారు చేశారు. అయితే, భారత మార్కెట్ నుంచి వైదొలగే ఉద్దేశం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News