: ఎన్నారై అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం కష్టమే.. దూరమవుతున్న పెళ్లి యోగం!


మొన్నటి దాకా ఎన్నారైలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అమ్మాయిల తల్లిదండ్రులు ఎన్నారై అల్లుళ్ల కోసం తెగ వెతికేవారు. లక్షలకు లక్షలు కట్నాలు పోసి, ఎన్నారైలను అల్లుళ్లుగా చేసుకునేవారు. అల్లుడు ఎన్నారై అయితే ఇక్కడున్న అత్తామామలకు సమాజంలో ఎంతో గౌరవం లభించేది.

కానీ, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఈ సీన్ మొత్తం తలకిందులైంది. హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు, కఠినతరమవుతున్న ఇమిగ్రేషన్ చట్టాలు, జడలు విప్పుతున్న జాత్యహంకారం, భారతీయులపై జరుగుతున్న భౌతిక దాడులు... తెలుగు రాష్ట్రాల్లోని అమ్మాయిల తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. ఎన్నారై సంబంధాలు ఎందుకు... ఇక్కడే ఓ మంచి సంబంధం చూసుకుందామనే కోణంలో వారు ఆలోచిస్తున్నారు. ఇటీవల తెలుగు యువకులపై జరిగిన కాల్పుల ఘటనలు కూడా వీరిలో భయాందోళనలను ఎన్నో రెట్లు పెంచేశాయి. ఇక్కడే ఉన్న అబ్బాయికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే... అమ్మాయి కూడా మన కళ్ల ముందే ఉంటుందన్న స్థితికి వారు వచ్చేశారు.

ఏపీ, తెలంగాణల్లో ఉన్న మ్యారేజ్ బ్యూరోలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఎన్నారై యువకులకు డిమాండ్ తగ్గిపోయిందని మ్యారేజ్ బ్యూరోల యాజమాన్యాలు అంగీకరిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో భారత టెక్కీల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడ్డాయని వారు చెబుతున్నారు. ఎన్నారైల ఉద్యోగాలకు భద్రత లేకపోవడం, వారిపై ఎప్పుడు, ఎవరు దాడి చేస్తారో అన్న భయం అమ్మాయిల తల్లిదండ్రుల్లో నెలకొందని తెలిపారు. ఇండియాలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న యువకుల వైపే అమ్మాయిల తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఎన్నారై యువకులకు వివాహం కావడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఈజీ కాదనే విషయం అర్థమవుతోంది. ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో!

  • Loading...

More Telugu News