: ఇదేనా మీరు చేసేది?... పాకిస్థాన్ కు తలంటిన యూఎస్!
ఉగ్రవాదులను ఎదుర్కోవడానికంటూ, అమెరికా నుంచి పెద్దఎత్తున ఆర్థిక సాయం, ఆయుధ సాయం పొందుతూ, ఇండియాకు ఉగ్రవాదులను పంపుతున్న పాకిస్థాన్ వైఖరిపై అమెరికా మండిపడింది. ఈ తరహా ద్వంద్వ వైఖరి సరికాదని యూఎస్ సెనెటర్ మార్క్ వార్నర్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పాక్ లో ఉగ్రవాదులు సురక్షితంగా ఉన్నారని, వారిని దాచి పెడుతున్నారన్న విషయాలు తమకు తెలుసునని, ఇదే పరిస్థితి కొనసాగితే, చూస్తూ ఊరుకోబోమని తెలిపారు. పాక్ ఉగ్రవాదులకు స్థావరంగా ఉందన్న విషయాన్ని ఆఫ్గనిస్థాన్ లోని తమ సీనియర్ జనరల్ సైతం స్పష్టం చేశారని మరో సెనెటర్ డాన్ సులివాన్ వ్యాఖ్యానించారు. కాగా, అమెరికాకు ఎంతమంది అధ్యక్షులు మారినా పాక్ కు నిరాటంకంగా సాయం అందుతున్న సంగతి తెలిసిందే. ఇక కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి వైఖరిని ప్రదర్శిస్తారన్నది తెలియాల్సివుంది.