: ముస్లింలకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే.. కలెక్టర్ పై దాడి ఆయన పైశాచికత్వానికి నిదర్శనం.. మైనారిటీ నేతలు
కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సెంట్రల్ జైలుకు పంపిస్తానన్న వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాల్సిందేనని మైనారిటీ నేతలు డిమాండ్ చేశారు. గురువారం గుంటూరులోని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హిదాయత్ మాట్లాడారు. కలెక్టర్‌పై దాడి జగన్ పైశాచికత్వానికి నిదర్శనమని అన్నారు. కలెక్టర్‌ను దుర్భాషలాడి దౌర్జన్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక ముస్లిం ఐఏఎస్ అధికారి అయిన అహ్మద్‌పై జగన్ వ్యవహరించిన తీరు చూస్తుంటే ముస్లింలపై ఆయనకున్న చులకనభావం అర్థమవుతోందన్నారు. అసలు బాబును జైలుకు ఎందుకు పంపిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
నగదు రహిత సమాజం కోసం ప్రజలను చైతన్య పరిచి ప్రధాని చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నందుకు అతడిని జైలుకు పంపిస్తావా? అంటూ జగన్‌ను ప్రశ్నించారు. జగన్‌లాంటి ఆర్థిక నేరగాడి వ్యాఖ్యలతో మొత్తం ముస్లిం సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయని హిదాయత్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి హయాంలోనూ కలెక్టర్ రఫత్ అలీని ఇలాగే వేధించారని గుర్తు చేశారు. జగన్ తన అవినీతితో ఎందరో ఐఏఎస్ అధికారులను జైలుకు పంపారని ఆరోపించారు. జగన్ తన వ్యాఖ్యలకు తక్షణం క్షమాపణలు చెప్పకుంటే ఆయనను జైలుకు పంపే వరకు ఉద్యమిస్తామని హిదాయత్ హెచ్చరించారు.