: శిక్షణ పేరుతో మోసాలకు పాల్పడ్డ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్టు
సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి శిక్షణ ఇస్తానంటూ మోసాలకు పాల్పడ్డ ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బెంగళూరుకు చెందిన ఎం.శ్రీకాంత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ప్రముఖ ఐటీ సంస్థలు అయిన ఐబీఎం, డెలాయిట్, ఎరిక్సన్ వంటి సంస్థల్లో పని చేశాడు. ఆ తర్వాత సొంతంగా ‘4 వీస్ కన్సల్టింగ్ అండ్ ట్రైనింగ్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ అడ్రసు మహారాష్ట్రలోని పుణె చిరునామాతో ఉంది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేయాలనుకునే ఫ్రెషర్స్ ను టార్గెట్ చేస్తూ, పలు జాబ్ పోర్టల్స్ లో తన సంస్థ గురించి యాడ్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో దోమలగూడలోని ఎలాంత్ర కన్సల్టెన్సీస్ శ్రీకాంత్ ను సంప్రదించింది. పదహారు మంది ట్రైనీలకు శిక్షణ ఇవ్వాలని శ్రీకాంత్ ను కోరగా, అందుకు అంగీకరించిన అతను రూ.2.79 లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ, శిక్షణ ప్రారంభించకపోవడంతో అనుమానం వచ్చిన ‘ఎలాంత్ర’ నిర్వాహకుడు అషీత్ రాజ్ సక్సేనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు కూపీ లాగి, నిందితుడు శ్రీకాంత్ ను ఈరోజు అరెస్టు చేశారు.