: అమెరికాలో తెలుగు వారు ఆడంబరాలకు దూరంగా ఉండాలి: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సూచన
అమెరికాలో తెలుగు వారు ఆడంబరాలకు దూరంగా ఉండాలని, తమ సంపద, సంపాదన, వాహనాలను ప్రదర్శనకు పెట్టవద్దని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే భారతీయుల సంపాదనపై కన్నుపడ్డ వారి దృష్టిలో పడితే కనుక మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని అమెరికాలో ఉన్న తెలుగు వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
అమెరికాలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం తమను తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో పరిస్థితులు త్వరలోనే కుదుటపడతాయని, అమెరికన్లతో కలిసిపోయే విధంగా తెలుగు వారు జీవించాలని, ఆ విధంగా చేస్తే తెలుగు వారి సంస్కృతిని అమెరికన్లు అర్థం చేసుకుంటారని అన్నారు. కాగా, గత నెల 27వ తేదీన నిర్వహించిన టాటా సమావేశంలో ఆమె ఈ సూచనలు చేశారు.