: మేము ఖలీఫా సైనికులం.. చైనాలో రక్తం ఏరులై పారుతుంది చూడండి: ఐఎస్ఐఎస్ తీవ్ర హెచ్చరికలు
ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ తన చివరి వీడియో సందేశంగా చెప్పుకుంటూ తన సైన్యానికి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. తాము పోరాటంలో ఓడిపోయామని చెబుతూనే, మిగిలిన వారు ఆత్మాహుతి దాడులు చేస్తూ మరణించాలని ఆయన చెప్పారు. మరోవైపు చైనాలో మాత్రం ఆ సంస్థ ఉగ్రవాదులు హెచ్చరికలు చేశారు. చైనాలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తామని, రక్తం ఏరులై పారిస్తామని అన్నారు. ఇంతవరకు చైనా లక్ష్యంగా హెచ్చరికలు చేయని ఐఎస్.. తొలిసారిగా ఇటువంటి వ్యాఖ్యలు చేసింది.
అరగంట నిడివి గల వీడియోలో ఉగ్రవాదులు ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు అమెరికాకు చెందిన సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ పేర్కొంది. తమ దేశ పశ్చిమ ప్రాంతమైన జిన్‌జియాంగ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల పట్ల చైనా స్పందిస్తూ అందుకు కారణం బహిష్కరణకు గురైన ఉయ్‌గర్ వేర్పాటువాదులే అని ఆరోపిస్తోంది. గ్లోబల్ జిహాదీ గ్రూపులతో వారికి సంబంధాలు కూడా ఉన్నాయని ఎప్పటినుంచో చెబుతోంది.
ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఓ వీడియాలో ఓ ఇన్ఫార్మర్‌ను ఐఎస్ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. ఈ సందర్భంగానే ఓ ఉయ్‌గర్ ఐఎస్ ఉగ్రవాది ఈ హెచ్చరికలు జారీ చేశాడు. తాము ఖలీఫా సైనికులమని, ఆయుధాలతోనే చైనాకు సమాధానం చెబుతామని హెచ్చరించాడు. ఎక్కువగా ముస్లిం జనాభా ఉన్న ఆ ప్రాంతంపై వివక్ష కొనసాగుతోందని ఉయ్‌గర్లు ఆరోపిస్తున్నారు.