: ఇది ఆ సినిమా కథ కాదు.. ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయిన తోడికోడళ్లు!
సినీనటులు చిరంజీవి, మోహన్ బాబు కలసి నటించిన 'పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమాలో ఇద్దరు తోడికోడళ్లు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పట్టణానికి వెళతారు. అచ్చం అలాంటి ఘటనే కడప జిల్లా రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది. అక్కడి వరిగె పాపిరెడ్డిగారి పల్లెకు చెందిన అన్నదమ్ములు శ్రీనివాసులరెడ్డి, సంజీవరెడ్డిలు నిన్న పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి తమ తమ భార్యలు శ్రావణి, సువర్ణ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. వారిద్దరు గత 20 సంవత్సరాలుగా తమ తల్లిదండ్రులతో పట్టణంలోని సరస్వతీనగర్‌లో ఉంటున్నారు. ఇద్దరు తోడికోడళ్లు చిత్తూరు మార్గంలో ఉన్న మెప్మా కార్యాలయంలో ప్రభుత్వ ఉచిత టైలరింగ్ శిక్షణ పొందుతున్నారు. అయితే తన తండ్రి కంటి ఆఫరేషన్ చేయించుకున్నాడని, చూడడానికి వెళుతున్నానని చెప్పిన శ్రావణి తన తోడి కోడలుతో కలిసి మంగళవారం రాత్రి పెద్దకాల్వపల్లెకు వెళ్లింది.
అయితే, నిన్న ఉదయం 11.30 గంటల సమయంలో గాలివీడు మార్గం వైపు నుంచి వస్తున్న ఆటోలో ఇద్దరూ ఎక్కినట్లు కొందరు తెలిపారు. ఆ సమయంలో పెద్దకాల్వపల్లెకే చెందిన ఏడుగురు ఆటోలో ఉన్నారని పలువురు తెలిపారు. అనంతరం దిబ్బలబడి సమీపంలో ఇద్దరు తోడికోడళ్లు మినహా మిగిలిన వాళ్లందరూ ఆటో దిగేశారని, వారిని కూడా దిగండని ఆటోలో ఉన్న స్థానికులు అడగ్గా తాము టైలరింగ్ శిక్షణకు వెళుతున్నట్లు చెప్పారు. ఆ తరువాత తోడికోడళ్లు ఇద్దరూ తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో వారి వారి భర్తలు పెద్దకాల్వపల్లెలోని అత్తామామలను ఫోన్‌లో వాకబు చేశారు. వారిద్దరూ తమ ఇంటినుంచి వెళ్లి చాలా సేపైందని వాళ్లు సమాధానం చెప్పడంతో టైలరింగ్ సెంటర్‌లోనూ వారు విచారించారు.
అయితే, వాళ్ళిద్దరూ అసలు టైలరింగ్ సెంటర్‌కే రాలేదని నిర్వాహకులు చెప్పారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మరోవైపు తాము క్షేమంగానే ఉన్నామని తోడికోడళ్లలో ఒకరైన శ్రావణి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. తమ కోసం ఆందోళన చెంది వెతకాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు గందరగోళానికి గురయ్యారు. అసలు కిడ్నాప్ జరిగిందా? లేక అదృశ్యమయ్యారా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోన్ కాల్స్, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీస్తున్నారు.