: అమ్మవారి పాదాల దగ్గర తన ఇంటర్ హాల్ టికెట్ పెట్టమని ఇస్తే.. దాన్ని మాయం చేసేశాడు!
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఇంటర్మీడియట్ రెండో సంవత్సర పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షలకు ఈ రోజు హాజరుకావాల్సిన ఓ విద్యార్థిని మంగళవారం కళాశాలలో తనకు ఇచ్చిన హాల్ టికెట్‌ను పట్టుకొని విజయవాడ దుర్గగుడికి వెళ్లింది. సాధారణ క్యూలో తన హాల్ టికెట్‌తో పాటు ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకుని, తనకు మంచి మార్కులు రావాలని మొక్కుకుంది. ఇంతలో ఆమెకు దుర్గగుడి ఆంతరాలయంలోకి వెళుతున్న ఓ వ్యక్తి కనిపించాడు. దాంతో తన హాల్ టికెట్ ను అతనికి ఇచ్చి, అమ్మవారి పాదాల చెంత ఉంచి, తీసుకురావాలని, తాను గేటు వద్ద నిలబడతానని చెప్పింది.
అయితే, తిరిగి బయటకు వచ్చిన ఆ వ్యక్తిని తన హాల్ టికెట్ ఏదని ప్రశ్నిస్తే, ఆయన 'హుండీలో వేసేశానుగా' అని సమాధానం ఇచ్చాడు. దీంతో కన్నీరు పెట్టుకుంటున్న ఆ విద్యార్థినికి 'నెట్‌లో మళ్లీ డౌన్‌లోడు చేసుకోవచ్చు కదా' అని చెప్పాడు. అనంతరం ఆ ఆలయ అధికారులను ఆ విద్యార్ధిని వేడుకుని తన హాల్ టికెట్ తనకు ఇవ్వాలని కోరింది. హుండీని ఎప్పుడు పడితే అప్పుడు తెరవకూడదని చెప్పిన ఆలయ అధికారులు బుధవారం హుండీ లెక్కించే సమయానికి రావాలని చెప్పారు. అలాగే నిన్న గుడికి వెళ్లిన విద్యార్థికి నిరాశ ఎదురైంది. హుండీ తెరిచి లెక్కించగా దాంట్లో హాల్ టికెట్ కనపించలేదని ఆలయ అధికారులు చెప్పారు. దీంతో ఆ విద్యార్థిని అక్కడి నుంచి వెళ్లిపోయింది.