: బార్బర్‌గా పనిచేస్తున్నాడు.. కానీ ఆయన మేబ్యాచ్, 10 బీఎండబ్ల్యూ, 3 ఆడి కార్ల యజమాని!
ఆయన పేరు రమేష్ బాబు(45). బెంగళూరులోని ఓ బార్బర్ షాపుకి వెళ్లి చూస్తే ఆయన షాపుకి వచ్చిపోయేవారికి కటింగ్ చేస్తూ కనిపిస్తారు. కానీ, ఆయన వద్ద ఇటీవల కొనుగోలు చేసిన 3.2 కోట్ల ఖరీదు చేసే మేబ్యాచ్ కారుతో పాటు రోల్స్ రాయ్స్, 11 మెర్సిడెజ్, 10 బీఎండబ్ల్యూ, 3 ఆడి, 2 జగ్వార్ కార్లు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న మేబ్యాచ్ కారు బెంగళూరు నగరంలో మరో ఇద్దరికి మాత్రమే ఉంది. ఈ ఖరీదైన కార్లను ఆయన అద్దెకు ఇస్తుంటాడు. ఓ బార్బర్ గా తన వృత్తిని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ 150 లగ్జరీ కార్లకు యజమాని అయ్యారు. ప్రస్తుతం రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీని నడిపిస్తున్నారు.
విశేషం ఏమిటంటే, తాను అన్ని కార్లకు యజమాని అయినప్పటికీ ఓ బార్బర్‌గా పనిచేస్తూ సింపుల్ గా కనిపిస్తారు. తన మూలాలను మరచిపోకుండా రోజూ సెలూన్‌లో కనీసం ఐదు గంటలు పనిచేస్తానని తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అలా గత 30 ఏళ్లుగా ఆయన బార్బర్‌గా పనిచేస్తూనే ఉన్నారట. ఆయన సెలూన్‌లో పని ముగించుకోగానే ఖరీదైన రోల్స్ రాయ్స్ కారులో తిరుగుతుంటారు. దేశాన్ని వదిలి పారిపోయిన విజయ మాల్యా, మరో బిల్డర్ తర్వాత ఈ మోడల్ కారు తనవద్దే ఉందని రమేష్ పేర్కొన్నారు. ఇదంతా దేవుడి దయ అని సవినయంగా చెప్పారు. తాను చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు.
అసలు ఎప్పటి నుంచో ఆయనకీ ఓ కల ఉండేదట. ప్రతి లగ్జరీ కారునూ కొనుగోలు చేయాలని కలలు కనేవాడట. అందుకే ఇలా ఇన్ని కార్లను సొంతం చేసుకున్నానని అంటున్నారు. ఈ కార్లను డ్రైవింగ్ చేస్తుంటే థ్రిల్‌గా ఉంటుందని అంటున్నారు. తన తండ్రి తన తొమ్మిదేళ్ల వయసులో మరణించారని, అనంతరం తమ కుటుంబం పేదిరకంలో మగ్గిపోయిందని, అమ్మ ఎన్నో కష్టాలుపడి తమని పోషించారని చెబుతున్నారు. తాను పదోతరగతి ముగించాక బార్బర్ వృత్తి చేపట్టి, 1994లో ఓ మారుతి వ్యాన్ తీసుకొని అద్దెకు ఇవ్వడం ప్రారంభించానని, అనంతరం ఒక్కో కారు కొనుక్కుంటూ ట్రావెట్స్ కంపెనీ స్థాపించానని చెప్పారు. అందుకే తాను ఇప్పటికీ సెలూన్‌లో పనిచేస్తుంటానని అన్నారు.