: కేరళ సీఎంను హతమారిస్తే కోటి రూపాయలిస్తా: ఆర్ఎస్ఎస్ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
కేరళ సీఎం పినరయి విజయన్ ను హతమార్చిన వారికి కోటి రూపాయలు నజరానాగా ఇస్తానంటూ ఆర్ఎస్ఎస్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తన ఆస్తులు మొత్తం అమ్మి అయినా సరే, ఆ నజరానా ఇస్తానని మధ్యప్రదేశ్ కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ అన్నారు. ఉజ్జయినిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎంపీ చింతామణి మాలవీయ, ఎమ్మెల్యే మోహన్ యాదవ్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రావత్ వారి సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, కేరళలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులకు.. సీపీఎం నాయకులకు మధ్య వైరం కొనసాగుతోంది. అంతేకాకుండా, పినరయి విజయన్ అధికారంలోకి వచ్చాక కేరళలో ఎనిమిది మంది బీజేపీ నాయకులు మృతి చెందారు. దేశాన్ని చీల్చేందుకు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని, ప్రపంచాన్ని వణికించిన నియంతల విధానాలను ఆర్ఎస్ఎస్ అనుసరిస్తోందని పినరయి విజయన్ ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పినరయి విజయన్ పై చంద్రావత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.