: మమ్మల్ని బౌన్స‌ర్లు అని రోజా అన్నారు.. అవినీతిపరులని జగన్ అంటున్నారు: పోలీసు అధికారుల సంఘం నిరసన


తమను బౌన్స‌ర్లు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్మోహన్ రెడ్డి అవినీతి ప‌రులంటున్నారని పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు వారు విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిన్న నందిగామలో తమపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. తమని వైసీపీ నేతలు దొంగలు, బౌన్సర్లు, జైలుకి పంపిస్తామని అంటున్నారని వారు చెప్పారు. వైసీపీ నేతల తీరుకి వ్యతిరేకంగా న‌ల్ల బ్యాడ్జిలు పెట్టుకుని నిర‌స‌న తెలుపుతున్నామని అన్నారు. ‘ప్ర‌భుత్వాలు మారతాయి, సీఎంలు మారుతారు, మేము ఇలాగే ఉంటాం.. ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని ఎన్నుకున్నారు.. వారికి న్యాయం చేసేలా మీ తీరు ఉండాలి. పోలీసులు ప్ర‌జ‌ల ఆస్తుల‌ను కాపాడుతారు. మమ్మల్ని ఈ నాయ‌కులు ఎలా తిడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోండి’ అని పోలీసులు అధికారుల సంఘం సభ్యులు అన్నారు.

‘జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌న పార్టీ నేత‌ల‌కు బుద్ధి చెప్పాల్సిందిపోయి ఆయ‌‌నే ఇలా మాట్లాడితే ఎలా?' అని వారు అన్నారు. మా ఉద్యోగాల‌కు అడ్డుప‌డ‌కండి.. మేము చ‌ట్టం, న్యాయం, ధ‌ర్మం, రాజ్యాంగం ప్ర‌కారం ప‌నిచేస్తాం.. రాజ‌కీయ నాయ‌కుల కింద కాదు... వైసీపీ నేత‌లు ప‌రుష ప‌ద‌జాలం వాడుతున్నారు. ప్ర‌శ్నించ‌డం త‌ప్పా? అని అంటున్నారు.. అది త‌ప్పు కాదు, మీరు ప్ర‌శ్నించే విధాన‌మే త‌ప్పు.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో హుందాగా ఉండండి’ అని అన్నారు. తాము కలెక్టరుని దూషించిన విషయంలో మాట్లాడడం లేదని, జగన్ పార్టీ నేతలు తమని కూడా దూషిస్తున్నందుకు మాట్లాడుతున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News