: శుభవార్త... ఈ ఏడాది కొత్తగా 2.8 లక్షల కేంద్ర ఉద్యోగాలు ఇవ్వడానికి సర్కారు కసరత్తు
ఈ ఏడాది పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా దేశంలో కొత్తగా 2.8 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో ఈ ఉద్యోగాలు అధికంగా ఉండనున్నట్లు సమాచారం. నల్లధన నిర్మూలనలో భాగంగా ఐటీ శాఖపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆదాయపన్ను శాఖలో 46 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఆ సంఖ్య 80 వేలకు చేరనుంది.
కేంద్ర ప్రభుత్వం గతేడాది జీఎస్టీ సవరణ బిల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్న కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు కొత్తగా 41 వేల ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఆ శాఖలో 50,600 మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే ఏడాది ఆ సంఖ్య 91,700కు పెరగనుంది. అయితే, రైల్వే శాఖలో మాత్రం ఎటువంటి కొత్త ఉద్యోగాలు ఉండబోవని కేంద్ర సర్కారు స్పష్టం చేసింది. ఇక విదేశాంగ శాఖలో కొత్తగా 2 వేల కొలువులను సృష్టించనున్నారు. సమాచార శాఖలోనూ కొత్తగా రెండు వేలకుపైగా ఉద్యోగాలు రానుండగా, కేబినెట్ సెక్రటేరియట్లో ప్రస్తుతమున్న ఉద్యోగుల సంఖ్య 921 నుంచి వచ్చే ఏడాది 1218కు పెంచాలని కేంద్ర సర్కారు కసరత్తు చేస్తోంది.