: జగన్ ను కలెక్టర్, డాక్టర్ అవమానించాల్సిన అవసరమేంటి?: రోజా
నందిగామ ఘటన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇది ఒక నిదర్శనమని ఆమె అన్నారు. ఒక పక్షినో, జంతువునో హింసిస్తేనే కేసులు పెడుతున్న ప్రస్తుత కాలంలో... 11 మంది మృతికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం మీద కేసులు పెట్టకుండా, చనిపోయిన డ్రైవర్ కు పోస్టు మార్టం నిర్వహించకుండా, రెండో డ్రైవర్ ను అరెస్ట్ చేసి వివరాలు రాబట్టకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తనకు అనుకూలమైన కలెక్టర్ ను, అధికారులను జగన్ పైకి చంద్రబాబు ఉసిగొలిపారని విమర్శించారు. రోడ్డు ప్రమాదాల విషయంలో దేశంలో ఏపీ ఐదో స్థానంలో ఉందని... మన రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు. మీడియాతో మాట్లాడుతున్న జగన్ దగ్గరకు వెళ్లి దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం కలెక్టర్ కు ఎందుకని ప్రశ్నించారు. ఒక ప్రతిపక్ష నేతను కలెక్టర్, డాక్టర్ కలసి అవమానించాల్సిన అవసరమేంటని నిలదీశారు.