: రాజీనామా చేశాకే మంత్రులుగా ప్రమాణం చేసేందుకు రాజ్ భవన్ కు రండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన గవర్నర్!


ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తరువాత మాత్రమే మంత్రి పదవులు స్వీకరించేందుకు రాజ్ భవన్ కు రావాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తేల్చి చెప్పినట్టు సమాచారం. గతంలో జరిగిన కొన్ని అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ఆపై మంత్రులుగా బాధ్యతలు స్వీకరించాలని, ఆరు నెలల్లో ఏదో రూపంలో ఎన్నికల్లో గెలవాలని నరసింహన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అలా కాకుండా మంత్రి పదవులు పొందాలని చూస్తే మాత్రం తానంగీకరించనని ఏపీకి చెందిన ఓ సీనియర్ మంత్రికి స్వయంగా చెప్పినట్లు  సమాచారం.

త్వరలో ఏపీలో మంత్రి వర్గ విస్తరణను చేపట్టనున్నారని, ఆ సమయంలో వైకాపా నుంచి గెలిచి, టీడీపీలో చేరిన కొందరికి మంత్రి పదవులు వస్తాయని భావిస్తున్న తరుణంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, అవి ఆమోదం పొందిన తరువాతనే వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తానని నరసింహన్ తేల్చి చెప్పడంతో ఏం చేయాలోనని పార్టీ నేతలు తలపట్టుకుంటున్నట్టు సమాచారం. గతంలో తెలంగాణలో టీడీపీ టికెట్ తో గెలిచి, టీఆర్ఎస్ లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన విషయంలో తనపై వచ్చిన విమర్శలను, కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను ఈ సందర్భంగా గవర్నర్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మరోసారి అలా జరగకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని గవర్నర్ వెల్లడించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News