: ఏపీలో మరో బస్సు ప్రమాదం.. ప్రకాశం జిల్లాలో బస్సు బోల్తా.. 30 మంది విద్యార్థులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మర్చిపోకముందే ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం అలవలపాడు వద్ద పాలేరు వంతెనపై గురువారం తెల్లవారుజామున మరో ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లి వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కల్వర్టును ఢీకొని అదుపుతప్పి వాగులో పడింది. ఈ ఘటనలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే కనిగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిలో ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది విద్యార్థులు ఉన్నారు. ఉలవపాడు మండలం కరేడు ఉన్నత పాఠశాలకు చెందిన వీరంతా మహానంది, యాగంటికి విహారయాత్రకు వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కనిగిరి ఎమ్మెల్యే బాబురావు అధికారులను ఆదేశించారు.