: రాహుల్ వ్యాఖ్యలు.. నెటిజన్ల విమర్శలు!
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. కనీస అవగాహన కూడా లేకుండా ఆ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నెటిజన్లు విమర్శించడమే కాదు, వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడుతూ, మణిపూర్ లో పైనాపిల్, వక్క, తమలపాకులు వంటి పంటలు బాగా పండుతాయని, కాబట్టి ఇక్కడ ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే ఆయన మరో వ్యాఖ్య చేశారు. లండన్ లో ఎప్పుడూ ఎవరో ఒకరు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలని, ఆ బాటిల్ పై మేడ్ ఇన్ మణిపూర్ అని రాసి ఉండాలన్నది తన ఆశ అని రాహుల్ పేర్కొన్నారు. అయితే, మణిపూర్ లాంటి వాతావరణంలో కొబ్బరి చెట్లు పెరగవని, కొబ్బరికాయల దిగుబడి అసలే ఉండదనే కనీస విషయం రాహుల్ కు తెలియదని నెటిజన్లు విమర్శించారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. 'రాహుల్ కు స్పీచ్ రాసి ఇచ్చేటప్పుడు మణిపూర్ సీఎం ఇబోబి సింగ్ ఈ విషయాన్ని మర్చిపోయారేమో'నంటూ వ్యంగ్యంగా అన్నారు.