: తమిళనాడులో ‘పెప్సీ’, కోక్’ లపై వేటు!
తమిళనాడు సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’పై నిషేధం విధించాలని జంతు సంరక్షణ సంస్థ (పెటా) కోరడం, ఆ సంస్థపై తమిళ ప్రజలు ఆగ్రహించడం తెలిసిందే. పెటాకు మద్దతుగా నిలిచిన తమిళ సినీ రంగానికి చెందిన వారిపై కూడా తమిళ ప్రజలు తమదైన శైలిలో ఆందోళనలు నిర్వహించడం విదితమే. పెటాకు ఆర్థిక సాయం చేసే బహుళ జాతి సంస్థలు, శీతల పానీయాలు తయారు చేసే పెప్సీ, కోకోకోలాను నిషేధిస్తున్నట్లు తమిళనాడు వనిగర్ సంఘం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్పత్తుల విక్రయాలను తమిళనాడు వ్యాప్తంగా నిషేధిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ రోజు ఉదయం నుంచి ఆయా ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోయాయని, తమ నిర్ణయానికి సానుకూల స్పందన వస్తోందని వనిగర్ సంఘం అధ్యక్షుడు ఏఎం విక్రమరాజా పేర్కొన్నారు. పెప్సీ, కోక్ లలో క్రిమి సంహారకాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో స్థానికంగా తయారు చేసే శీతల పానీయాలు కాలీ మార్క్, బొవాంటో, టోనిరో వంటి వాటి అమ్మకాలు పెరిగేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. కాగా, తమిళనాడు లోని థియేటర్లలో పెప్సీ, కోక్ ల అమ్మకాలపై ఇప్పటికే నిషేధం విధించారు.