: రేప్ కేసు నమోదు కావడంతో అదృశ్యమైన యూపీ మంత్రి
ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రీ ప్రజాపతిపై అత్యాచారం కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో... ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, అతను ఉన్నట్టుండి అదృశ్యమైపోయాడు. ఆయనను ప్రశ్నించేందుకు లక్నోలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులకు ఆయన ఆచూకీ దొరకలేదు. దీంతో, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరపున ఆయన పోటీ చేస్తున్న అమేథీ నియోజకవర్గంలో కూడా పోలీసులు గాలింపు జరిపారు. అయినా ఆయన ఆచూకీ దొరకలేదు. ఈ సందర్భంగా లక్నో సీనియర్ ఎస్పీ మంజిల్ సైనీ మాట్లాడుతూ, కేవలం ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆయన ఇలాగే కనిపించకుండా తిరిగితే, ఇతర చర్యలను కూడా చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.
రాష్ట్ర మంత్రి గాయత్రీ ప్రజాపతి తన అనుచరులతో కలసి తనపై అత్యాచారం చేశారని ఓ బాలిక పోలీసులను ఫిర్యాదు చేసింది. అంతేకాదు, కోర్టు ముందు కూడా ఆమె తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఆ బాలికకు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.