: పన్నీర్ సెల్వం తాజా ఎత్తుగడ... నిరాహారదీక్ష
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, తన మద్దతుదారులతో కలసి నిరాహారదీక్ష చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తన వర్గం వారంతా నిరాహారదీక్షలు చేపట్టేలా సన్నాహాలను ఆయన ప్రారంభించినట్టు తెలుస్తోంది. చెన్నైలోని చెపాక్ ప్రాంతంలో పన్నీర్ దీక్షకు కూర్చుంటారని, మిగతా ప్రాంతాల్లో ఆయన తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలు, మద్దతుదారులు దీక్షల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమ దీక్షలకు అనుమతి కోరుతూ చెన్నై నగర పోలీసు కమిషనర్ ఎస్ జార్జ్ కి పన్నీర్ వర్గంలోని నేత, మాజీ మంత్రి మధుసూదన్ లేఖను ఇచ్చారు. పన్నీర్ సీఎంగా ఉన్నప్పుడు జయ మృతిపై విచారణకు ఆదేశించినా, అది ఇంకా కార్యరూపం దాల్చలేదని ఈ సందర్భంగా మధుసూదన్ ఆరోపించారు.