: మోదీని ఎంత పొగిడినా వెంకయ్యనాయుడు ఆ పదవిని చేపట్టలేరు: సురవరం సుధాకర్ రెడ్డి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీని వెంకయ్య పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారని... కానీ, మోదీని ఎంత పొగిడినా వెంకయ్య రాష్ట్రపతి కాలేరని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఏబీవీపీపై ఆయన మండిపడ్డారు. ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థినిపై ఏబీవీపీ చేసిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. మీడియాపై కూడా ఏబీవీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని తెలిపారు. ప్రతి యూనివర్శిటీలో కూడా ఏబీవీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కేవలం ఏబీవీపీ వల్లే ఓ కార్గిల్ యుద్ధ వీరుడి కుమార్తె చదువు మానేసి, ఇంటికి వెళుతున్నట్టు ప్రకటించిందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ప్రసంగాలు చాలా దారుణంగా ఉన్నాయని... ఆయన ప్రసంగాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు.