: తోటి విద్యార్థులు పరీక్ష హాల్లో ఉంటే.. మరోవైపు ఆందోళనలో పాల్గొంటున్న ‘శ్రీవాసవి’ విద్యార్థులు
హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీవాసవి ఇంటర్మీడియట్ కళాశాల యాజమాన్యం బోర్డుకు ఫీజు చెల్లించని కారణంగా ఆ కాలేజీ విద్యార్థులు 224 మంది పరీక్షలకు దూరమైన విషయం తెలిసిందే. నిన్నంతా కళాశాల వద్దే ఆందోళన కొనసాగించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ రోజు కూడా తమ ఆందోళనను కొనసాగించారు. కొంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని సచివాలయం ముందు కూడా ఆందోళనకు దిగారు. తమ హాల్‌టికెట్లు తమకు ఇప్పించి, పరీక్ష రాసేలా అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తామంతా కూలి పనులకు వెళ్లి తమ బిడ్డలకు ఫీజులు చెల్లించామని కొందరు, తమ పిల్లల భవిష్యత్తు కోసం బంగారం తాకట్టు పెట్టి చదివిస్తున్నామని మరికొందరు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.