: వైద్యుల నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ ను లాక్కున్నారంటూ.. జగన్ పై క్రిమినల్ కేసు నమోదు!


వైసీపీ అధినేత జగన్ పై మరో క్రిమినల్ కేసు నమోదయింది. కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 353, 506, రెడ్ విత్ 34, 363 కింద కేసు నమోదు చేశారు. వైద్యుల నుంచి బలవంతంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ను లాక్కున్నారంటూ నందిగామ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ పట్ల జగన్ చాలా దురుసుగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆసుపత్రిలో కృష్ణా జిల్లా కలెక్టర్ పై దురుసుగా ప్రవర్తించారంటూ టీడీపీ నేత వాసిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, జగన్ తో పాటు మాజీ మంత్రి పార్థసారథి, మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, కొండ్రెడ్డి శ్రీను, అరుణ్ కుమార్, కొమ్మినేని రవిశంకర్, జోగి రమేష్, మాగంటి అబ్బాయిలతో సహా 10 మంది నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. బస్సులోని మిగిలిన ప్రయాణికులంతా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో, వీరిని పరామర్శించడానికి జగన్ నందిగామ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా, అక్కడున్న వైద్యులపై జగన్ దురుసుగా ప్రవర్తించినట్టు వార్తలొచ్చాయి. 

  • Loading...

More Telugu News