: జగన్ ప్రవర్తనను నిరసిస్తూ... ఏకమవుతున్న ఐఏఎస్ లు!
కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద నిన్న జరిగిన బస్సు ప్రమాదంపై స్పందించిన ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నందిగామ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసుపత్రిలో డాక్టరు వద్ద ఉన్న ఓ రిపోర్టును లాక్కొని, తిరిగి ఇవ్వకుండా వైద్యుడితో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.బాబుపై పలు వ్యాఖ్యలు చేశారు.
సెంట్రల్ జైలుకి పంపిస్తానంటూ, పోలీసులు, కలెక్టర్ సహా అందరూ అవినీతిపరులేనని జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్రంలోని ఐఏఎస్‌లు ఆగ్రహంతో ఉన్నారు. జగన్ తమను కించపరిచే విధంగా ప్రవర్తించడంపై చర్చించేందుకు ఈ రోజు సచివాలయంలో వీరు భేటీ అయ్యారు. తమ భవిష్యత్ కార్యాచరణపై ఐఏఎస్ అధికారుల సంఘం చర్చిస్తోంది. అనంతరం జగన్ ప్రవర్తనపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఆ సంఘం అధ్యక్షుడు ఏకే ఫరీదా ఆధ్వర్యంలో ఈ చర్చ జరుగుతోంది. జగన్ తీరు ఎంత మాత్రం క్షమించరానిదని ఐఏఎస్‌లు అభిప్రాయపడ్డారు. ఆసుపత్రిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా దురుసుగా ప్రవర్తించినట్లు తెలిపారు.